OpenAI

AI, పిల్లల భద్రతపై పరిశోధనకు మద్దతు

పిల్లలపై AI ప్రభావాన్ని మరింత బాగా అర్థం చేసుకుని, వారి భద్రతకు, శ్రేయస్సుకు తోడ్పడే ప్రపంచవ్యాప్త కృషిలో భాగంగా OpenAI 20 లక్షల డాలర్లు అందిస్తామని హామీ ఇచ్చింది.

ఈ వారం ప్రారంభంలో పారిస్ శాంతి వేదికలో OpenAI పిల్లల కోసం మరింత సురక్షితమైన AI రూపకల్పనకు నిబద్ధత పత్రం⁠(కొత్త విండోలో తెరుచుకుంటుంది)పై సంతకం చేసింది. AI యుగంలో పిల్లల హక్కులు, రక్షణ కోసం ఏర్పడిన కూటమి ఆధ్వర్యంలోని శాస్త్రీయ పరిశోధన బృందాల సమాఖ్యకు మద్దతుగా 20 లక్షల డాలర్లు అందిస్తామని హామీ ఇచ్చింది.

ఇది యువతకు AI భద్రతపై ప్రపంచ ప్రమాణాలు ఉండాలన్న మా పిలుపును ముందుకు తీసుకెళ్తుంది. ఉమ్మడి ఆధారాలను ఆచరణాత్మక రక్షణ చర్యలుగా మలిచేందుకు ప్రభుత్వాలు, పరిశోధకులు, పౌర సమాజం, పరిశ్రమ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని మరింత బలపరుస్తుంది.

పిల్లలకు AI వల్ల కలిగే ముప్పులు, అవకాశాలను మరింత బాగా అర్థం చేసుకుని కొలిచేందుకు పరిశోధకులు ఉపయోగించగల సాధనాలను ఉమ్మడిగా అభివృద్ధి చేయడానికి మా ఆర్థిక సహకారం తోడ్పడుతుంది. ఈ పరిశోధన మరింత సురక్షితమైన ఉత్పత్తులు, మెరుగైన విధానాల రూపకల్పనకు ఆధారాలను అందిస్తుంది.

ఈ నిబద్ధత పత్రం సురక్షితమైన, వయసుకు తగిన AI కోసం ఉమ్మడి సూత్రాలను నిర్దేశిస్తుంది. అలాగే పరిశోధన కార్యక్రమాన్ని, దాని స్వతంత్రతను కాపాడే చర్యలను వివరిస్తుంది. పరిశోధన బృందాలు తమ నిర్ధారణలపై నియంత్రణను కలిగి ఉంటాయి. ప్రతికూల ఫలితాలు లేదా స్పష్టమైన నిర్ధారణకు రాని ఫలితాలతో సహా పరిశోధన ఫలితాలన్నీ ప్రచురితమవుతాయి.

యువత భద్రతకు, వికాసానికి ఎదురయ్యే ముప్పులను పరిష్కరిస్తూనే, వారికి AI ప్రయోజనాలు అందేలా చేయడానికి అవసరమైన ఆధారాలను సమకూర్చేందుకు ఈ కృషి తోడ్పడుతుంది. నేర్చుకోవడానికి, సృజనాత్మకతకు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఉపయోగపడే సాధనాలు అందుబాటులో ఉండేలా చూస్తూనే, బలమైన, అమలు చేయదగిన రక్షణలను కల్పించే సమగ్ర యువత AI భద్రతా చట్టాలకు మేము మద్దతిస్తున్నాం. ఈ కృషి ఆ మద్దతును మరింత ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి విధాన చట్రాల్లో వయసుకు తగిన రక్షణలు ముందుగానే అమల్లో ఉండాలి. తల్లిదండ్రుల కోసం సాధనాలు, క్రమం తప్పకుండా ముప్పుల అంచనా, వాటిని తగ్గించే చర్యలు, సమర్థమైన జవాబుదారీతనం కూడా ఉండాలి. యూరోపియన్ యూనియన్ బాలల చట్టం రూపుదిద్దుకుంటున్న క్రమంలో ఐరోపా విధాన రూపకర్తలతో కలిసి పనిచేయాలని మేము ఆశిస్తున్నాం. అలాగే యువతకు మరింత బలమైన రక్షణలు, మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా భాగస్వాములతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం.

రచయిత

OpenAI