ఆర్కెస్ట్రా బయోను కొనుగోలు చేసిన OpenAI
కృత్రిమ మేధ ఆధారిత ఔషధ అభివృద్ధి వేదిక కొత్త చికిత్సల దిశగా పురోగతిని వేగవంతం చేస్తుంది.
ఔషధాల అభివృద్ధిలోని సంక్లిష్ట ప్రక్రియను సమన్వయం చేసుకోవడంలో జీవఔషధ బృందాలకు తోడ్పడే వేదిక ఆర్కెస్ట్రా బయో(కొత్త విండోలో తెరుచుకుంటుంది)ను OpenAI కొనుగోలు చేసింది. ఆర్కెస్ట్రా బృందాన్ని, సాంకేతికతను జీవశాస్త్ర పరిశోధన కోసం మేము రూపొందించిన కృత్రిమ మేధ నమూనాలు, సాధనాల సమాహారమైన రోసలిండ్తో అనుసంధానిస్తున్నాం. శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలు చేయడానికి, వాటిని చికిత్సలుగా మలిచి రోగులకు మరింత త్వరగా అందించేందుకు అవసరమైన పనులను నిర్వహించడానికి తోడ్పడటమే మా లక్ష్యం.
కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేయడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. అమెరికాలో ఔషధం పనిచేయాల్సిన జీవసంబంధ లక్ష్యాన్ని గుర్తించినప్పటి నుంచి నియంత్రణ సంస్థల ఆమోదం పొందేవరకు సగటున సుమారు 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. శాస్త్రీయ పరిశోధనతో పాటు, అంతర్గత విభాగాలు, బాహ్య భాగస్వాముల మధ్య కార్యక్రమాలను కూడా బృందాలు సమన్వయం చేయాలి. ఇందుకోసం అవి తరచూ పరస్పర అనుసంధానం లేని వ్యవస్థలపై ఆధారపడుతుంటాయి. ఈ ప్రత్యేక నైపుణ్యం అవసరమయ్యే పనులను, సంక్లిష్ట కార్యప్రవాహాలను చేపట్టడంలో కృత్రిమ మేధ తోడ్పడగల కీలక మలుపు వద్ద ఇప్పుడు మనం ఉన్నాం.
రోసలిండ్ మా కృత్రిమ మేధ నమూనాలను, సాధనాలను జీవశాస్త్ర పరిశోధకులకు అందిస్తుంది. జీవశాస్త్రం, రసాయన శాస్త్రంలోని ప్రశ్నలను తార్కికంగా పరిశీలించడంలో GPT‑Rosalind శాస్త్రవేత్తలకు తోడ్పడుతుంది. రోసలిండ్ వర్క్బెంచ్ ఆ సామర్థ్యాలను శాస్త్రీయ సాధనాలు, దత్తాంశంతో అనుసంధానించి, పరిశోధకులు ఫలితాలను విశ్లేషించడానికి, ప్రయోగాలను ప్రణాళిక చేయడానికి తోడ్పడుతుంది.
ఔషధాల అభివృద్ధిని సమన్వయం చేసేందుకు రూపొందించిన వేదికతో పాటు, జీవసాంకేతికత, సాఫ్ట్వేర్, కృత్రిమ మేధ రంగాల్లో అనుభవమున్న బృందం కూడా ఆర్కెస్ట్రా ద్వారా మాతో చేరుతోంది. ఔషధంగా ఉపయోగపడే అవకాశమున్న పదార్థాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అధ్యయనాలు, నిర్ణయాలు, తదుపరి చర్యలతో శాస్త్రీయ పరిశోధన ఫలితాలను అనుసంధానించడంలో బృందాలకు తోడ్పడే ఏజెంట్లను కలిసి రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఔషధ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు మనుషులు, కృత్రిమ మేధ ఏజెంట్లు కలిసి పనిచేసే వేదిక ఆర్కెస్ట్రా బయో. అధ్యయనాలు, కార్యాచరణల పర్యవేక్షణను, పురోగతిని గమనించే బాధ్యతను శాస్త్రవేత్తలు, కార్యక్రమాల సారథులు ఏజెంట్లకు అప్పగిస్తారు. దీంతో పనికి దిశానిర్దేశం చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి, సమస్యల వల్ల జాప్యం జరగకముందే వాటిని పరిష్కరించడానికి వారికి సమయం లభిస్తుంది.
ఔషధ అభివృద్ధి కార్యక్రమంలోని ఒక భాగంలో తలెత్తిన సమస్య అనేక ఇతర భాగాలపై ప్రభావం చూపవచ్చు. ఉదాహరణకు, ఒక విడత తయారైన ఔషధం ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే, రోగులపై పరీక్షలు ప్రారంభించడంలో జాప్యం జరగవచ్చు. ఏ పనులు, కాలప్రణాళికలు ప్రభావితమయ్యాయో గుర్తించడానికి, సంబంధిత సమాచారాన్ని సేకరించడానికి, సమస్యను ఎదుర్కొనే మార్గాలను పోల్చిచూడటానికి ఆర్కెస్ట్రా ఏజెంట్లు బృందాలకు తోడ్పడతాయి. ఆ విశ్లేషణ ఆధారంగా శాస్త్రవేత్తలు, కార్యక్రమాల సారథులు తదుపరి ఏం చేయాలో నిర్ణయించుకోవచ్చు.
జీవశాస్త్రాల్లో కృత్రిమ మేధ సామర్థ్యాన్ని సాకారం చేయాలంటే, ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధిలో ముందంజలో ఉన్న సంస్థలతో సన్నిహితంగా కలిసి పనిచేయాలి. పటిష్ఠమైన పాలనా వ్యవస్థను కొనసాగిస్తూనే, నోవో నార్డిస్క్ విస్తృత కార్యకలాపాలను, శాస్త్రీయ నైపుణ్యాన్ని ఉపయోగించుకుని పరిశోధన, అభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాల అమలును వేగవంతం చేయడమే ఆ సంస్థతో మా భాగస్వామ్య లక్ష్యం. మోడెర్నాలో సంక్లిష్ట దత్తాంశం నుంచి పొందిన అవగాహనను ప్రయోగాల కార్యప్రవాహాలుగా మలచడంలో కృత్రిమ మేధ బృందాలకు తోడ్పడుతోంది. ఇది పరిశోధన, అభివృద్ధిని వేగవంతం చేసే అవకాశం కల్పిస్తోంది.
కొత్త ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి ప్రక్రియ అంతటా కృత్రిమ మేధ శాస్త్రవేత్తలకు తోడ్పడాలన్నదే మా దార్శనికత. ఆలోచనలను అన్వేషించడం, ప్రయోగాలను రూపొందించడం, ఫలితాలను అర్థం చేసుకోవడం, ఆశాజనకమైన చికిత్సలను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన పనులను సమన్వయం చేయడం ఇందులో భాగాలు. ఆర్కెస్ట్రా బయోను రోసలిండ్తో అనుసంధానించడం ఆ దార్శనికతను సాకారం చేసే దిశగా ఒక అడుగు. పరిశోధకులు, మా భాగస్వాములతో కలిసి మరిన్ని ఆవిష్కరణలను సాధ్యం చేయాలని, కొత్త ఔషధాలు రోగులకు మరింత త్వరగా చేరేందుకు తోడ్పడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.


